'ఖుషీ' టైటిల్ ను వాడేస్తున్న విజయ్, సమంత

Admin 2022-04-19 01:01:35 ENT
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి సినిమాలో జంటగా కనిపించారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంతలు. ఆ సినిమాలో వాళ్లిద్దరూ కనిపించేది కొంచెంసేపే అయినా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు కనిపిస్తుంది. దీంతో విజయ్-సామ్ ల కాంబినేషన్ తో ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ ని తెరకెక్కించబోతున్నాడు మజిలీ ఫేమ్ శివ నిర్వాణ.

కాశ్మీర్ వంటి మంచు ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకోబోతున్న ఈ మూవీ ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. ఇందుకోసం విజయ్, సమంతలిద్దరూ కేవలం నాలుగు నెలల సమయాన్ని మాత్రమే కేటాయించారని, ఆ టైం లోనే మూవీ కి సంబంధించిన అన్ని పనులను చక్కబొట్టుకోవాల్సిన బరువైన బాధ్యతను దర్శకుడు శివ నిర్వాణ మీద ఉంచారని కొంతకాలం కిందట వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ పై ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

అదేంటంటే.... శివ నిర్వాణ దర్సకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి 'ఖుషీ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట చిత్రబృందం. 'ఖుషీ'... ఈ టైటిల్ కున్న ప్రత్యేకతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎస్. జె. సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ మూవీ ఖుషీ. ఒకవేళ ఇదే టైటిల్ తో కనక విజయ్, సమంతల మూవీ రాబోతుందంటే ఆ సినిమాపై భారీ అంచనాలు నమోదవడం ఖాయం. అలానే, ఆ సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది శివ నిర్వాణ బృందం. అయినా ఒకరకంగా చెప్పాలంటే, ఖుషీ అనే టైటిల్ ను కనుక తమ సినిమాకి ఖరారు చేసుకుంటే, శివ నిర్వాణ, విజయ్, సమంత ఒక పెద్ద సాహసానికి పూనుకున్నట్లే.

ఏప్రిల్ 21న ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమవుతుందనీ, ఏప్రిల్ 23 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని చిత్రసీమలో వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి.