నన్ను దేవుడితో పోల్చడం సరికాదు : సోనూసూద్‌

Admin 2020-11-16 18:56:13 entertainmen
దేవుడితో పోల్చడం సరికాదని సినీనటుడు సోనూసూద్ అన్నారు. కొన్ని నెలలుగా చాలా మందికి సాయం చేస్తోన్న ఆయనను సూపర్ మన్ అని, దేవుడని, రియల్ హీరో అని ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, ఈటీవీలో నిర్వహించిన ఓ షోలో వర్చువల్ పద్ధతితో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. రోడ్డు పక్కన యాచకులకు రూ.10 సాయం చేస్తేనే దేవుడని అంటారని, అలాంటిది చాలా మందికి సోనూసూద్ సాయం చేశారని, ఆయనను ఏం అనాలని శేఖర్ మాస్టర్ అడిగారు. దీనికి సోనూసూద్ స్పందిస్తూ తనను దేవుడితో పోల్చడం సరికాదని, తాను కూడా అందరిలాగా సాధారణమైన వ్యక్తినేనని చెప్పారు. కష్టాల్లో ఉన్నవారిని చూసినప్పుడు తనకెంతో బాధగా అనిపించేదని, వలసకార్మికులు, చదువులు, రోగుల శస్త్రచికిత్సలకు ఇలా సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని తన వంతుగా ఆదుకొన్నానని తెలిపారు. తన ప్రాణం ఉన్నంత వరకూ వీలైనంత మందికి అండగా ఉంటానని చెప్పారు. ఈ గొప్పతనం అంతా తన తల్లిదండ్రులదేనని, వారే తనకు స్ఫూర్తి అని తెలిపారు.