నటి మాల్వీని కత్తితో పొడిచిన నిర్మాత

Admin 2020-10-28 15:08:13 entertainmen
సినీనటి, టీవీ షో ప్రజెంటర్ మాల్వీ మల్హోత్రాపై నిర్మాత యోగేశ్ కుమార్ కత్తితో దాడి చేశారు. మాల్వీని కడుపులో నాలుగు సార్లు కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆసుప్రతిలో చికిత్ప పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తెలుగులో 'కుమారి 18+' అనే చిత్రంలో మాల్వీ నటించింది.

ప్రొడక్షన్ పని కోసం గత ఏడాది మాల్వీని యోగేశ్ కుమార్ కలిశారు. ఇటీవలే ఆమె వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. అయితే అతని ప్రపోజల్ ను ఆమె తిరస్కరించింది. నిన్న రాత్రి తన ఇంటి నుంచి మాల్వీ బయల్దేరింది.

ఎదురుగా ఆడీ కారులో యోగేశ్ వచ్చాడు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అతనితో మాట్లాడేందుకు మాల్వీ నిరాకరించడంతో కత్తితో నాలుగు పోట్లు పొడిచాడు. ఆమె కడుపు, కుడిచేతి మణికట్టు, ఎడమ చేతికి గాయాలయ్యాయి.

2019లో ఫేస్ బుక్ ద్వారా యోగేశ్ తనకు పరిచయమయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాల్వీ తెలిపింది. తన వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకురాగానే ఆయనను దూరం పెట్టానని చెప్పింది. మరోవైపు మాల్వీని కత్తితో పొడిచిన విజువల్స్ అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.