ప్రభాస్ 'సలార్'లో నాయికగా

Admin 2020-12-10 23:14:17 entertainmen
హీరో ప్రభాస్ మరో మూడు కొత్త చిత్రాలను అంగీకరించిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి 'సలార్'. 'కేజీఎఫ్' సినిమాతో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే నటించనుంది. అలాగే 'ఆదిపురుష్'లో కూడా బాలీవుడ్ భామనే ఎంపిక చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో 'సలార్'లో కూడా బాలీవుడ్ భామ నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందాలతార దిశా పథానితో సంప్రదింపులు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో దిశ తెలుగులో తొలిసారిగా 'లోఫర్' సినిమాలో నటించింది. ఇదిలావుంచితే, ఈ చిత్రంలో ఇతర పాత్రలకు గాను హైదరాబాదులో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 15న గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉదయం 9 నుంచి సాయంకాలం 6 వరకు ఈ ఆడిషన్స్ జరుగుతాయి. ఆసక్తిగల నటీనటులు ఆడిషన్స్ కు హాజరుకావచ్చు.