MAA అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు

Admin 2021-10-16 02:59:45 ENT
మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు కార్యవర్గ సభ్యులు కూడా ఈరోజే ప్రమాణస్వీకారం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు హాజరయ్యారు. ప్రకాశ్ రాజ్‌ ప్యానెల్‌కు చెందిన వారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరవగా.. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి వారు కూడా దూరంగా ఉన్నారు. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోహన్ బాబు, విష్ణులపై ప్రశంసలు కురిపించారు. మా అసోసియేషన్‌కు ప్రభుత్వం అన్ని విధాలా అండదండగా ఉంటుందని చెప్పిన మంత్రి.. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.